అర్ధరాత్రి సౌదీ రోడ్లపై కార్లతో మహిళల సందడి.. మహిళా డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేత


సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలతో రోడ్డెక్కారు. కార్లను డ్రైవ్‌ చేస్తూ, కేరింతలు కొడుతూ అర్ధరాత్రి సందడి చేశారు. కార్లకు బెలూన్లను కట్టి.. రోడ్లపై విహరిస్తూ.. షాపింగ్‌ చేస్తూ.. ఇతర మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ ఎంజాయ్‌ చేశారు. ఇంతకీ మహిళలు ఇలా ఎందుకు సందడి చేస్తున్నారంటే.. సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై దశాబ్దాల కాలం నుంచి అమలులో ఉన్న నిషేధం ఆదివారంతో అధికారికంగా ముగిసిపోయింది. ప్రపంచంలో ఇలా మహిళల డ్రైవింగ్‌పై నిషేధం విధించిన ఏకైక దేశం సౌదీ అరేబియానే.

నిషేధం ముగియడంతో రాజధాని రియాద్‌లో శనివారం అర్ధరాత్రే మహిళలు కారు డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపైకి చేరారు. తమకు ఈ స్వేచ్ఛ లభించినందుకు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ‘నేను చాలా అదృష్టవంతురాలిని.. ఎంతో సంతోషంగా ఉంది. నా వాహనాన్ని నేనే నడుపుతున్నందుకు గర్వంగా ఉంది’ అని 23 ఏళ్ల మజ్దూలీన్‌ అల్‌ అతీఖ్‌ అనే మహిళ సంతోషంగా తెలిపింది. ముగ్గురు పిల్లల తల్లి, టీవీ యాంకర్‌ అయిన సమర్‌ తన సొంత వాహనంలో తొలిసారిగా డ్రైవర్‌ సీట్లో కూర్చుంది. తాను పుట్టిన ఊరిలో, తన కారులో అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. మధ్యమధ్యలో ఆమె వాహనాన్ని పలువురు మహిళలు ఆపి శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగనంపారు.



గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు సల్మాన్‌.. సంస్కరణల్లో భాగంగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నెల ఆరంభంలో మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడి సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించే పనిలో పడ్డాయి. మరికొందరేమో గోకార్టింగ్‌, వీడియోగేమ్స్‌, అనుకరణ యంత్రాల ద్వారా డ్రైవింగ్‌ నేర్చుకొని సిద్ధమవుతున్నారు.

అయితే ముస్లిం దేశమైన సౌదీ అరెబియాలో మహిళా డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేత కోసం కొన్నేళ్లుగా పోరాటం జరిగింది. పలువురు మహిళా హక్కుల పోరాటదారులు అరెస్టు కూడా అయ్యారు. మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ కూడా సౌదీ నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌదీలో సంస్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొంది. నిషేధం ఎత్తివేత అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం సౌదీ అరేబియాలో నూతన ప్రగతిశీల ధోరణికి నిదర్శనమని మిత్రదేశాలు అభివర్ణిస్తూ స్వాగతించాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com