అమ్మో.. మగువల ముఠా


మహిళలు అంటే సున్నిత మనస్కులు అనే భావన ఉంటుంది. కానీ వారిలో కొందరు తెగిస్తే ఎంతకైనా వెనకాడరనేది తాజాగా సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన ముగ్గురు మహిళల ఉదంతం వెల్లడిస్తోంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ ముగ్గురు ముఠాగా ఏర్పడి దృష్టి మళ్లించే నేరాల్లో నిమగ్నమయ్యారు. ఈ ముఠా కార్యకలాపాలపై ఉప్పందిన సైబరాబాద్‌ నేరవిభాగం పోలీసులు నిఘా ఉంచడంతో వీరు చిక్కారు. వీరిని రాజేంద్రనగర్‌ మైసమ్మ కలిష్‌ఖాన్‌ దర్గా ప్రాంతానికి చెందిన చెల్ల నర్సమ్మ(40), బోరబండ మసీదు ప్రాంతవాసి వేముల సమ్మక్క అలియాస్‌ లక్ష్మి అలియాస్‌ జర్రీ(35), ఫతేనగర్‌ శివశంకర్‌కాలనీలో ఉండే బండారి అనిత అలియాస్‌ యాదమ్మ(34)గా గుర్తించారు. శంషాబాద్‌ జోన్‌ పరిధిలోని ఆమన్‌గల్లు ప్రాంతంలో దృష్టి మళ్లించే నేరానికి పాల్పడుతున్న క్రమంలో బాలానగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి బృందం స్థానిక పోలీసులతో కలిసి వీరిని పట్టుకుంది. వీరి వద్ద నుంచి 80గ్రాముల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ముఠా ఆమన్‌గల్లుతోపాటు కందుకూరు ఒకటి, నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పరిధిలో నేరాలకు పాల్పడినట్లు తేలింది.
జైల్లో పరిచయంతో జట్టు కట్టి..
ఈ ముగ్గురు నిందితురాళ్లకు గతంలో నేరచరిత్ర ఉంది. రాజేంద్రనగర్‌, మియాపూర్‌, పేట్‌బషీరాబాద్‌, సనత్‌నగర్‌, జవహర్‌నగర్‌, కుషాయిగూడ, మేడిపల్లి, ఘట్‌కేసర్‌, హుమాయున్‌నగర్‌, లంగర్‌హౌస్‌, కుల్సుంపురా, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, బచ్చన్నపేట ఠాణాల పరిధిలో వీరిపై వేర్వేరుగా కేసులున్నాయి. రాజేంద్రనగర్‌లో బెల్ట్‌షాప్‌ నిర్వహించే చెల్ల నర్సమ్మపై గతంలో కుల్సుంపురా పోలీసులు పీడీ చట్టం కింద జైలుకు పంపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు దూరంగా ఉంటూ నేరాల బాట పట్టింది. అలాగే కూలీ పనిచేస్తున్న అనిత భర్త గిరి చనిపోగా.. ఇళ్లల్లో పనిచేసే సమ్మక్క భర్త నగేశ్‌ నుంచి దూరంగా ఉంటోంది. చంచల్‌గూడ మహిళా జైళ్లో పరిచయమైన వీరికి చోరీల అనుభవం ఉండటంతో ముగ్గురు కలిసి ముఠా కట్టారు.

బాధితురాళ్లను నమ్మించి మోసం
జైలు నుంచి విడుదలయ్యాక దృష్టి మళ్లించే నేరాల కోసం వీరు పథకం వేశారు. కల్లు కాంపౌండ్‌లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఒంటరిగా సంచరించే వృద్ధ మహిళల్నే వీరు లక్ష్యంగా ఎంచుకుంటారు. వృద్ధ మహిళలు కొంచెం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే వారి దృష్టి సోకే విధంగా బంగారం పూత పూసిన ఆభరణాన్ని రహదారిపై పడేస్తారు. సదరు వృద్ధురాలు ఆ ఆభరణాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ముఠాలోని ఓ మహిళ అక్కడికి వస్తుంది. బంగారు ఆభరణాన్ని తానూ చూశానంటూ పట్టుబడుతుంది. వీరిద్దరు మాట్లాడుకుంటుండగానే ముఠాలోని మరో మహిళ దారిన పోయినట్లుగా నటిస్తూ అక్కడికి వస్తుంది. ఆ ఆభరణాన్ని చూసి నిజమైన బంగారు నగనే అంటూ చెప్పి వెళ్లిపోతుంది. అలా నిజమైన బంగారు నగగా వృద్ధ మహిళను నమ్మిస్తారు. సదరు వృద్ధ మహిళ అయోమయ పరిస్థితుల్లో ఉండగానే బంగారు ఆభరణాన్ని చెరిసగం పంచుకుందామని నిందితురాలు ప్రతిపాదిస్తుంది. సమీపంలోని నగల వ్యాపారి వద్దకు వెళ్లి చెరిసగం తీసుకుందామని గనక వృద్ధురాలు అంటే వ్యతిరేకిస్తుంది. నగల వ్యాపారి కొంత మొత్తం నొక్కేస్తాడని.. అందుకే నీ ఒంటిపై ఉన్న నగలను ఇచ్చేస్తే బంగారు ఆభరణం ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోతానని స్పష్టం చేస్తుంది. ఆభరణం పెద్ద మొత్తంలో ఉంటుందనే ఆశతో బాధితురాలు ఒంటిపై ఉన్న నగల్ని ఇస్తే తీసుకొని ఉడాయిస్తుంది. ఈ ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు దృష్టి సారించి వీరిని పట్టుకున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com