చమురు మంట


ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండున్నరేళ్లకు పైగా గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇరాన్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్‌ ధర 68 డాలర్లకు పైగా చేరింది. ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌తో కలిసి అణు ఒప్పందం కుదుర్చుకోబోదన్న వార్తలు ఇందుకు నేపథ్యం. ఒప్పందానికి గడువు అయిన జనవరి 13 సమీపిస్తున్న కొద్దీ ఆ భయాలు మరింత ఎక్కువవుతున్నాయి. మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే అమర్చుకుంటున్న మన భారత్‌పై ఈ పరిణామాలన్నీ ప్రతికూల ప్రభావాలను తెచ్చిపెట్టేవే.
చమురు ధరలు 50-55 డాలర్ల స్థాయిలో ఉన్నంత వరకూ భారత ఆర్థిక వ్యవస్థకు భయం అక్కర్లేదని విశ్లేషకులు చెప్పేవారు. కానీ ఇపుడు అది 68 డాలర్లకు చేరే సరికి ‘చమురు మీద సాము’లా తయారైంది. ఇటీవలే ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను తగ్గించడం కోసం ప్రభుత్వం సుంకాలను తగ్గించడం తెలిసిందే. ఇంతకీ చమురు ధరలు తగ్గితే భారత్‌పై ఏ రూపంలో ప్రభావం ఉంటుందో చూద్దాం.

ఈ ఏడాది మరింత పైకి!
గతేడాది నుంచి పెరగడం మొదలుపెట్టిన చమురు ధరలు ఈ ఏడాది కూడా అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా పైకే వెళతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబరు 2014 తర్వాత కనిపించని 70 డాలర్ల స్థాయిని త్వరలోనే అందుకుంటుందనీ అనుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మొత్తం మీద చమురు ధరలు 50-68 డాలర్ల మధ్య కదలాడవచ్చని భావిస్తున్నారు. 2014లో ఏకంగా 107.68 డాలర్లకు చేరిన ధరలు 2016లో 26.05 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2017లో ఒపెక్‌ దేశాలు, రష్యాలు ఉత్పత్తి కోత వేయడంతో క్రమంగా ధరలు పుంజుకున్నాయి. ఈ ఉత్పత్తి తగ్గింపు ఒప్పందం ఈ ఏడాదీ కొనసాగుతుంది కాబట్టి ఈ ఏడాదంతా ధరలు పెరుగుతూనే ఉండొచ్చన్నది విశ్లేషకుల భావనగా ఉంది.
ఎందుకు పెరిగాయంటే..
గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ నిల్వలు తగ్గడం ఇందుకు నేపథ్యం. 2014లో 100 డాలర్లకు చేరిన చమురు ధరలు విపరీతమైన ఉత్పత్తి, ఇతరత్రా కారణాల వల్ల 2016 కల్లా 40 డాలర్లకు చేరాయి. ఇది చమురు ఎగుమతి దేశాల ఆర్థిక స్థితిని బాగా దెబ్బతీశాయి. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌) పరిస్థితులను చక్కదిద్దడానికి పూనుకుంది. ఉత్పత్తిలో కోత విధించడానికి పూనుకున్నాయి. గత సంవత్సర కాలంగా అదే పనిలో ఉన్నాయి. మార్చి తర్వాత కూడా ఆ కోతను కొనసాగిస్తాయన్న సంకేతాలే గత కొద్ది కాలంలో చమురు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఈ ప్రభావంతో ఇటీవల బ్యారెల్‌ ధర 65 డాలర్లకు చేరింది. తాజాగా 68 డాలర్లకు చేరడానికి ఇరాన్‌ అనిశ్చితులే కారణం.
మనం మారాల్సిన అవసరం ఉందా?
చమురు ధరలు ఇన్నాళ్లూ తక్కువగా(50-55 డాలర్లు) ఉండడంతో దిగుమతుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఒక వేళ ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మనకు ఎప్పటికైనా ఇబ్బందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశీయ చమురు త్పత్తిని పెంచడంతో పాటు షేల్‌ గ్యాస్‌, పునరుత్పాదక ఇంధనం దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1 ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు
ముడి చమురు ధరలు పెరిగే కొద్దీ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే డిసెంబరులో జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధాన సమీక్షపై ఆ ప్రభావం పడింది కూడా. రాబోయే సమీక్షలపైనా ఇది ప్రభావం చూపవచ్చు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ద్రవ్య లోటు, కరెంట్‌ ఖాతా లోటులు కూడా అధ్వానమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నొమురా అంటోంది. బ్యారెల్‌ ధర పెరిగే ప్రతీ 10 డాలర్లకు భారత ద్రవ్య లోటు 0.1 శాతం తగ్గుతుంది.
2 పెట్రోలు, డీజిల్‌ ధరలు
మన దేశంలో డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎప్పుడో ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగితే అది నేరుగా వీటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే దిల్లీలో డీజిల్‌ లీటరు ధర ఆల్‌టైం గరిష్ఠ స్థాయి అయిన రూ.59.38కి చేరింది. పెరిగిన ముడి చమురు ధరలను చమురు మార్కెటింగ్‌ సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం ద్వారా నేరుగా వినియోగదార్లకు బదిలీ చేశాయే అనుకుందాం. అపుడు ముడి చమురు ధరల ప్రతీ 10 శాతం పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 0.25 శాతం చొప్పున పెరుగుతుంది.
3 దిగుమతి బిల్లు
బారెల్‌ ధర ఒక డాలరు పెరిగినా.. భారత దిగుమతి బిల్లు 1.33 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుంది. ఇది దేశీయ కరెన్సీ మీద ఒత్తిడి తీసుకువస్తుంది. రూపాయి మారక విలువ(డాలరుతో పోలిస్తే) తగ్గే ప్రతీ రూపాయిపైనా దిగుమతి బిల్లు 1.03 బిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. ఇలా జరగడం వల్ల అధిక ద్రవ్యలోటుకు దారి తీస్తుంది. ఒక వేళ ప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎమ్‌సీ)లకు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే.. దిగుమతి బిల్లు మరింత పెరుగుతుంది.
4 వృద్ధి
గతేడాది నవంబరులో పెద్ద నోట్ల రద్దు, జులై 1 నుంచి జీఎస్‌టీ అమలు కానున్న నేపథ్యంలో జూన్‌ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావాల నుంచి బయటపడి పరుగులు తీయడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు తాజాగా ముడి చమురు ధరల రూపంలో వృద్ధి వేగానికి కళ్లెం పడేలా కనిపిస్తోంది. బారెల్‌ ధర 10 డాలర్ల చొప్పున పెరిగే కొద్దీ జీడీపీ వృద్ధి 0.15 శాతం దాకా తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనాలే చెబుతున్నాయి.
5 స్టాక్‌ మార్కెట్లు
వృద్ధి మందగిస్తే మదుపర్ల సెంటిమెంటు సాధారణంగానే దెబ్బతింటుంది. ప్రస్తుతం మన మార్కెట్లు ఆసియాలోనే అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్నాయి. గతేడాది సెన్సెక్స్‌, నిఫ్టీలు 27% దాకా లాభపడ్డాయి. బలహీన ఆర్థిక వృద్ధి, అధిక షేరు ధరలకు తోడు కార్పొరేట్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా వెలువడడంతో ఎఫ్‌ఐఐలు ఆగస్టు, సెప్టెంబరులో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వ బ్యాంకులకు మూలధనం ఊతాన్ని ప్రకటించడంతో ఎఫ్‌ఐఐలు నవంబరులో మన మార్కెట్ల పట్ల ఆకర్షితులయ్యారు. తాజా పరిణామంతో మార్కెట్లు ఏ దిశగా నడుస్తాయో చూడాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com