సీఏల సేవలకు విలువ కట్టలేం


‘కంపెనీలు, వ్యక్తులు తమ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు చేరడానికి చార్టర్డ్‌ అకౌంటెంట్లు (సీఏ) మార్గం సుగమం చేస్తారు. సమర్థమైన అకౌంటెంట్‌, కంపెనీకి విలువ కట్టలేని ఆస్తి’ అని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) సీహెచ్‌ శైలజా కిరణ్‌ అన్నారు. ఖాతాల సమర్పణ (రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌) ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయని, జవాబుదారీతనం పెరుగుతున్న నేపథ్యంలో ఆడిటర్ల బాధ్యతలు పెరుగుతున్నాయని వివరించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్లు (సీఏ) కేవలం పన్నుల లెక్కలు, చెల్లింపులపైనే కాక విలువ చేర్చిన ఇతర సేవలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)కు చెందిన బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎస్‌) హైదరాబాద్‌లో సీఏ విద్యార్థుల సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో గౌరవ అతిథిగా శైలజా కిరణ్‌ ప్రసంగించారు. ‘దాదాపు 27 సంవత్సరాలుగా మార్గదర్శి చిట్‌ ఫండ్‌ నిర్వహిస్తున్నాను. నా దృష్టి ఎప్పుడు వ్యాపార అభివృద్ధిపైనే ఉంటుంది. లాభాలు, పన్ను చెల్లింపుల గురించి నేనెప్పుడు పట్టించుకోలేదు. అవన్నీ ఆడిటర్లే చూసుకుంటారు. గత పదిహేనేళ్లుగా నేను ఆడిటర్లనే కలవలేదు’ అని శైలజా కిరణ్‌ తెలిపారు. కంపెనీ పాలన, నష్టభయం నిర్వహణ, అంతర్గత నియంత్రణలు సమర్థంగా పని చేస్తున్నాయన్న భరోసా కంపెనీ యాజమాన్యానికి అంతర్గత ఆడిటర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల నుంచే లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ద్రవ్య విధానాలను రూపొందించడంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్ర కీలకమని.. కోట్ల మంది జీవితాలను అవి ప్రభావితం చేస్తాయని గుర్తు చేశారు. సీఏలు ప్రజల ప్రయోజనాల రక్షకులని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే ఆ నమ్మకాన్ని కోల్పోతారని శైలజా కిరణ్‌ అన్నారు. సమగ్రత, వృత్తిపరమైన బాధ్యతలు, ప్రవర్తన, గోప్యత మొదలైన వాటిలో విలువలు పాటించాలన్నారు. కంపెనీల్లో వినూత్నతను ప్రోత్సహించడానికి సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరమని తెలిపారు. జాతి, భావి తరాల భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని యువతకు ఉద్బోధించారు. అందరికీ ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావాలని, పేదరికంపై విజయం సాధించాల్సి ఉందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని మంచి స్థితికి చేరిన వారు, అవి లేని వారికి సహకారం అందించాలని, అసాధ్యాలను యువత సుసాధ్యం చేయగలదని చరిత్ర చెబుతోందని శైలజా కిరణ్‌ అన్నారు.
ఎన్నో మార్పులు వస్తున్నాయ్‌
అకౌంటింగ్‌ వృత్తిలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, పురోభివృద్ధి చెందుతున్న కంపెనీలు తమ అకౌంటెంట్లు, ఆడిటర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా స్వీకరిస్తున్నాయని, కంపెనీ కీలక నిర్ణయాల్లో పాలుపంచుకునేలా చేస్తున్నాయని ముఖ్య అతిథిగా విచ్చేసిన సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, నాస్‌కామ్‌ మాజీ ఛైర్మన్‌ బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి తెలిపారు. సైబర్‌ భద్రత పరంగా ఆడిటర్లకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, బిగ్‌ డేటా, అనలిటిక్స్‌ సాంకేతిక పరిజ్ఞానాలు అకౌంటింగ్‌ నిపుణులకు కొత్త సవాళ్లతోపాటు అవకాశాలను తీసుకురాగలవని అభిప్రాయపడ్డారు. సీఏ విద్యార్థులు కోర్సు పూర్తి చేయడానికి శిక్షణ కేంద్రాలపై ఆధారపడొద్దని, అవి నిజమైన నిపుణులుగా తీర్చిదిద్దలేవని ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.దేవరాజా రెడ్డి అన్నారు. ఐసీఏఐలో 2.7 లక్షల మందికి సభ్యత్వం ఉందని, ఇందులో 30 వేల మంది సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారని చెప్పారు. దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు సీఏ కోర్సు పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. తొమ్మిది దేశాల్లో భారత సీఏలకు గుర్తింపు ఉందని, వచ్చే 5-10 సంవత్సరాల్లో దాదాపు 100 దేశాల్లో గుర్తింపు లభించగలదని, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ అతుల్‌ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ భారత చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విద్యార్థుల సంఘం (సికాసా) హైదరాబాద్‌ శాఖ ఛైర్మన్‌ పంకజ్‌ కుమార్‌ త్రివేది, దక్షిణ భారత ప్రాంతీయ మండలి (సిర్క్‌) హైదరాబాద్‌ శాఖ ఛైర్మన్‌ ఆర్‌.చెంగల్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ఎ.వేంకటేశ్వర రావు తదితరులు ప్రసంగించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com