పేల్చేదెవరు?


అణుబాంబుల్ని పేల్చే మీట తన టేబుల్‌పై ఉందంటే.. తన టేబుల్‌పై ఉందంటూ.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఇంతకీ అణ్వాయుధ బటన్‌ వీరి చేతుల్లోనే ఉంటుందా? కేవలం అధ్యక్షుడొక్కరే అణ్వాయుధాల్ని ప్రయోగించేంతటి అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారా? ఆ పని చేయాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది? అనేవి ఆసక్తికర అంశాలు.
అమెరికాలో ఇలా...
అమెరికా అధ్యక్షుడు తనంతట తానుగా అణు మీట నొక్కి.. క్షిపణుల్ని ప్రయోగిస్తారన్నది ఊహ మాత్రమే. ఆ పని చేయడానికి ముందు వ్యూహాత్మక కమాండ్‌తో, సైనిక, పౌర సహాయకులతో అధ్యక్షుడు చర్చించాల్సి ఉంటుంది. అణు దాడికి అవసరమైన ‘న్యూక్లియర్‌ ఫుట్‌బాల్‌’ అధ్యక్షుడి వద్ద ఉంటుంది. నల్లటి ‘అత్యవసర తోలు సంచి’లో ఉండే నల్లటి లోహపు బ్రీఫ్‌కేస్‌ను ‘ఫుట్‌బాల్‌’ అని పిలుస్తారు. ఇది 20 కేజీల బరువుంటుంది. సంచి హ్యాండిల్‌ వద్ద చిన్న యాంటెన్నా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లాంటి నిర్ణీత కమాండ్‌ సెంటర్లలో కాకుండా.. ఎయిర్‌ఫోర్స్‌వన్‌, మెరైన్‌ వన్‌, అధ్యక్షుడి వాహనశ్రేణి.. ఇలా వేరే చోట ఉన్నప్పుడు అణు దాడికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి ఈ ఫుట్‌బాల్‌ను వినియోగిస్తారు. అణ్వాయుధ సంకేతాలు ఈ ఫుట్‌బాల్‌లో ఉంటాయి. ఈ ఫుట్‌బాల్‌ను మోసుకుని ఓ సైనిక సహాయకుడు ఎల్లప్పుడూ అధ్యక్షుడి వెంట ఉంటారు. సహాయకుడి విధుల్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. అతన్ని రొటేషన్‌ పద్ధతిలో మారుస్తుంటారు. ఐషన్‌హోవర్‌ అధ్యక్షుడిగా ఉన్న సయమం నుంచే ఈ ఫుట్‌బాల్‌ విధానం అమల్లో ఉంది.
ఫుట్‌బాల్‌లో ఏమేం ఉంటాయి?

* దాడి, ప్రతిదాడి అవకాశాలను సూచించే నల్లటి పుస్తకం ఉంటుంది.
* రహస్య ప్రదేశాల వివరాలు తెలిపే పుస్తకం మరోటి ఉంటుంది.
* హెచ్చరిక వ్యవస్థల్ని అప్రమత్తం చేసే 8 నుంచి 10 పేజీల ఫోల్డర్‌ ఉంటుంది. ఇది కమ్యూనికేషన్‌ సాంకేతిక పరిజ్ఞానం.
* దాడికి ఆదేశాలిచ్చే సంకేతాలతో కూడిన మూడు నుంచి 5 అంగుళాల పొడవైన ప్లాస్టిక్‌ కార్డు ఉంటుంది. దీనిని బిస్కెట్‌ అని పిలుస్తారు.
ఎలా ఆపరేట్‌ చేస్తారు?...
సైనిక బలగాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయిన అధ్యక్షుడు అణ్వాయుధ దాడికి దేశాలు ఇవ్వొచ్చు. అధ్యక్షుడు బ్రీఫ్‌ కేసును తెరిచి.. కమాండ్‌ సిగ్నల్‌ లేదా వాచ్‌ అలర్ట్‌ను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌కు ఇస్తారు. ఆ తర్వాత తన వెంట ఉన్న సైనిక సహాయకుడితో దాడి అవకాశాల్ని సమీక్షిస్తారు. ఒకేఒక క్రూయిజ్‌ క్షిపణి ద్వారా ప్రయోగించాలా లేదా బహుళ ఐసీబీఎం ప్రయోగాలు చేయాలా? అనే ప్రణాళికను నిర్ణయిస్తారు. ‘ఓప్లాన్‌ 8010’ అనే ప్రణాళిక(గతంలో దీనిని సింగిల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ ప్లాన్‌ అనేవారు) ప్రకారం ఇదంతా చేస్తారు. ఆ తర్వాత నల్లటి సంచిలో నుంచి కమ్యూనికేషన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరిచి.. సైనిక సహాయకుడు నేషనల్‌ మిలిటరీ కమాండ్‌ సెంటర్‌ను సంప్రదిస్తారు. అధ్యక్షుడు సంచిలోని ప్లాస్టిక్‌ కార్డుపై ఉండే ప్రత్యేక సంకేతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అమెరికాలో అణు ప్రయోగ కేంద్రాలపై అధ్యక్షుడికి, రక్షణమంత్రికి మాత్రమే అధికారాలుంటాయి. అధ్యక్షుడు స్వయంగా అణు ఆదేశాలు ఇచ్చారా? లేదా? అని రక్షణమంత్రి సరిచూసుకోవాల్సి ఉంటుంది. వాటిని తిరస్కరించే అధికారం రక్షణమంత్రికి లేదు. పాటించి తీరాల్సిందే. సంకేతాల్ని సరిచూసుకున్న తర్వాత.. సంబంధిత యూనిట్లకు దాడి ఆదేశాల్ని సైన్యం ఇస్తుంది. తదనుగుణంగా సైన్యం అణుబాంబుల్ని ప్రయోగిస్తుంది.

ఉత్తర కొరియాలో ఇలా...

ఉ.కొరియా అణు ప్రయోగ విధానాలు ఎలా ఉంటాయన్నది ఎవరికీ తెలియదు. కిమ్‌కు అణ్వాయుధాలన్నింటిపైనా నియంత్రణ ఉన్నప్పటికీ.. ఆయనే స్వయంగా క్షిపణులు ప్రయోగించరని, సైనికాధికారులకు ఆ ఆదేశాలు ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అమెరికాలో ‘ఫుట్‌బాల్‌’ విధానంలాగా ఇక్కడ ఉండదు. కిమ్‌ సర్వాధికారి కాబట్టి.. ఏం చేయాలనుకుంటారో ఆ మేరకు ఆయన ఒక్కరే.. వ్యూహాత్మక రాకెట్‌ బలగాలకు ఆదేశాలు ఇస్తారు. అయితే క్షేత్రస్థాయి యూనిట్లకు కూడా ఆయన నేరుగా ఆదేశాలు ఇస్తారా? అన్నది స్పష్టత లేదు. నిర్దిష్ట ప్రదేశాలపై దాడులు చేయాలన్న ఆదేశాల్ని ఎవరు ఇస్తారన్నదీ తెలియదు. అయితే ప్రత్యర్థులు ఊహించని రీతిలో దాడులు చేస్తే.. వాటిని తిప్పికొట్టడానికి స్థానిక యూనిట్లలోని జూనియర్‌ అధికారులకు సైతం కిమ్‌ అదేశాలు ఇవ్వొచ్చన్న వాదనా ఉంది. అణు యూనిట్లతో కిమ్‌ తరచూ సంప్రదిస్తుంటారు. ప్రత్యర్థిది పైచేయి అయినపుడు కొరియా సైన్యంలోని స్థానిక యూనిట్లే సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదనా ఉంది

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com