ముక్కోటి ఏకాదశి


ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ, అధిక మాసాలతో కలిపి అవి ఇరవై ఆరు! వాటిలో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది. మహావిష్ణువు దుష్టశిక్షణ కోసం అవతారాలు ధరించడం, భువికి దిగిరావడం పరిపాటి. ఆయన వైకుంఠం నుంచి నేరుగా వచ్చి దుష్టసంహారం చేసిన సందర్భాలు- పురాణ గాథల ప్రకారం రెండే రెండు.
గజేంద్రుడి మొర ఆలకించి, మొసలిపై ఆయన చక్రాయుధం ప్రయోగించిన సందర్భం ఒకటి. కృతయుగంలో మురాసుర సంహారం మరొకటి. సరాసరి వైకుంఠుడే దిగి వచ్చి ఏకాదశినాడు మురాసురుణ్ని వధించాడు కాబట్టి, ఇది ‘వైకుంఠ ఏకాదశి’ అయింది.

దేవతల సంఖ్య మూడు కోట్లు అని కొందరు అంటారు. ఆ సంఖ్య ముప్ఫై మూడు కోట్లు అని మరికొందరు చెబుతారు. దీనిపై లోకంలో రెండు అభిప్రాయాలున్నాయి. కోటి అనేది నిజానికి సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు (11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్ట వసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలు- ఇలా దైవాల మొత్తం సంఖ్య ముప్ఫై మూడు అంటుంది వేదం. సృష్టిక్రమంలో అన్నింటికీ వీరే బాధ్యులు కాబట్టి, ‘ముక్కోటి దేవతలు’ అని పురాణాలు వర్ణించాయి. వీరంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి భూలోకానికి తరలివచ్చే తిథి- ధనుర్మాస ఏకాదశి! అది మార్గశిరం, పుష్యం- ఏదైనా కావచ్చు. ముక్కోటి దేవతలూ కదలి వచ్చే తిథి కాబట్టి, ముక్కోటి ఏకాదశిగా సంభావిస్తారు.

శ్రీరంగంలోని రంగనాథస్వామి కోవెల- దేశంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి. వైకుంఠం సప్త ప్రాకారాల మధ్య ఉందని ప్రతీతి. శ్రీరంగం సైతం కావేరీ నది రెండు పాయల మధ్య, ఒక దీవిపై ఏడు ప్రాకారాల మధ్యలో ఉంది. అందుకే శ్రీరంగం ‘భూలోక వైకుంఠం’గా ప్రశస్తి పొందింది. ముక్కోటి దేవతలు అదే ఆలయం ఉత్తర ద్వారం గుండా శ్రీరంగనాథుడి దర్శనానికి వెళతారని స్థలపురాణ కథనం. ఇదే ఏకాదశి పూట వారి కైంకర్యాలకు సంకేతంగా ‘శ్రీరంగ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవాలు’ నిర్వహిస్తారు. ఆనాడు శ్రీరంగం భూలోక స్వర్గంలా కన్నులపండువగా గోచరిస్తుంది.

ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దేవతార్చనకు తరలివెళ్ళే శుభ ఘడియల్లో తామూ ప్రవేశిస్తే, వారి అనుగ్రహంతో తమకూ స్వర్గవాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగా ఉత్తర ద్వారానికి ‘స్వర్గద్వారం’ అనే పేరు స్థిరపడింది. అదే ఆచారం మొత్తం వైష్ణవాలయాలన్నింటికీ వర్తించడం మొదలైంది. ఉత్తర ద్వారం లేదా స్వర్గద్వార దర్శనం- వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ ఈ ఏకాదశి ఒక్కరోజునే అమలవుతుంది కాబట్టి దీన్ని ‘స్వర్గద్వార ఏకాదశి’ గానూ అభివర్ణించారు. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతో ఆరాటపడతారు. శ్రీరంగంలో దక్షిణాభిముఖుడైన స్వామిని సేవించడానికి భక్తులు ఉత్తర ముఖంగా నిలబడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశానికి అది సంకేతం. ఇన్ని రకాలుగా ప్రసిద్ధి వహించిందీ ఏకాదశి! ఉత్తర ద్వార ప్రవేశంతో స్వర్గవాసం దక్కాలన్న ఆకాంక్ష భక్తుల్లో ఉంటుంది. అందుకే తెల్లవారకముందే బారులు తీరుతుంటారు.

‘ముక్కోటి’ దేవతలు ‘వైకుంఠ’ స్వామి దర్శనానికి ఆరాటపడే ‘స్వర్గద్వార’ ఏకాదశి అత్యంత పుణ్యప్రద సందర్భం!

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com