అతి శుభ్రం.. అశుభ్రం.. రెండూ వద్దు!


మనుషులు రకరకాలు! కొందరు ఇంట్లో అన్నీ కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి.. అతిగా శుభ్రం చేస్తుంటారు. కానీ వస్తువులను మాత్రం ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. మరికొందరు వస్తువులను ఎక్కడివక్కడ పద్ధతిగా సర్దుతుంటారుగానీ శుభ్రత మాత్రం పెద్దగా పట్టించుకోరు! ఇంట్లో వస్తువులు పద్ధతిగా అమర్చుకుంటామా? లేక ఎక్కడివక్కడ పడేస్తామా? అన్నది మన ఇష్టంగానీ.. శుభ్రత అట్లాకాదు! మనం జబ్బులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, పనులన్నీ శుభ్రంగా చేసుకోవటం చాలా అవసరమని వైద్యరంగం ఎప్పుడో గుర్తించింది. మనం ఎదుర్కొంటున్న చాలా రకాల సమస్యలకు సూక్ష్మక్రిములే కారణమని 19వ శతాబ్దంలో వైద్యులు స్పష్టంగా నిర్ధారణకు వచ్చారు.. అప్పటి నుంచీ హానికారక సూక్ష్మక్రిములను వదిలించుకోవటం ఎలాగన్న ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంది. ఫలితంగా వచ్చినవే రకరకాల సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, క్లీÌనర్లు, ప్యూరిఫయర్లు, ఫ్రెష్‌నర్లు..! మార్కెట్లో ఈ శుభ్రత ఉత్పత్తులు పెరిగిన కొద్దీ.. మనుషుల్లోనూ ఈ శుభ్రత ధ్యాస పెరిగిపోతోంది. మంచిదేగానీ అసలు ఎంత శుభ్రత అవసరం? దీనికి అంతెక్కడ? శుభ్రత పేరుతో మనం రకరకాల రసాయనాలతో అన్నీ కడిగేస్తూ.. మట్టి దుమ్మూధూళి వంటివాటికి చాలా దూరంగా ఉండటం వల్ల మనకు లాభం జరుగుతోందా? నష్టం జరుగుతోందా? అన్న ప్రశ్న వైద్యపరిశోధకులను కూడా వేధిస్తోంది. ముఖ్యంగా శుభ్రం చెయ్యటానికి వాడుతున్న ఈ రసాయనాలు, ఇళ్లలో ఇవి సృష్టిస్తున్న రసాయన కాలుష్యం కాస్తాకూస్తా కాదన్న భయాలూ పెరుగుతున్నాయి. అందుకే దీని గురించి పరిశోధకులంతా లోతుగా తరచిచూస్తున్నారు.

అతిశుభ్రం.. అలర్జీకి మూలం?
పరిశుభ్రత పేరుతో మనం అతి శుభ్రం చేసెయ్యటం వల్ల పిల్లల్లోనూ, పెద్దల్లోనూ అలర్జీ, ఆస్థమా వంటి సమస్యలు పెరుగుతున్నాయన్నది ఇటీవలికాలంలో బలంగా వినిపిస్తున్న వాదన. అమెరికా, ఐరోపా దేశాల్లో పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. నానాటికీ పెరిగిపోతోంది కూడా. ముఖ్యంగా అలర్జీ కారణంగా ముక్కు బిగిసిపోయి నీళ్లు కారణం (అలర్జిక్‌ రైనైటిస్‌), కళ్ల దురదలు విపరీతమవుతున్నాయి. దీంతో పాటు ఆహార పదార్ధాలు పడకపోవటం (ఫుడ్‌ అలర్జీ) కూడా పెరుగుతోంది. ఈ జబ్బులు పెరగటానికి కారణం మన అతి శుభ్రతేనా? అని లండన్‌లోని పరిశుభ్రత, ఉష్ణమండల వ్యాధుల అధ్యయన సంస్థకు చెందిన డేవిడ్‌ స్ట్రాచన్‌ ఎప్పుడో 1989లోనే అనుమానం వ్యక్తం చేశారు. క్రమేపీ ఆ అనుమానమే బలపడి.. నేటి ఆధునిక జీవితాల్లో ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది తారసిల్లకపోవటం, చిన్నతనంలో ఎలాంటి సూక్ష్మక్రిములతోనూ సంపర్కం ఉండే అవకాశం లేకపోవటం వల్లే ఈ అలర్జీల సమస్యలు పెరుగుతున్నాయని వైద్యరంగం ఇప్పుడు దాదాపుగా ఆధారాలతో సహా రుజువు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే- పంట పొలాల్లో, పొలాల్లో ఉండే ఇళ్లలో పెరుగుతున్న పిల్లల్లో అలర్జీల సమస్య కాస్త తక్కువగా ఉంటోందని వీళ్లు గుర్తించారు. మన దేశంలో ఇప్పటికీ అపరిశుభ్రత’ అన్నది ఆరోగ్య సమస్యగానే ఉంది. కేవలం పరిశుభ్రత సరిగా పాటించకపోవటం వల్లనే లక్షలమంది పిల్లలు ఏటా నీళ్లవిరేచనాలు, వాంతులు, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి సమస్యల బారినపడుతున్నారు. కానీ పాశ్చాత్యదేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ పిల్లలను అతిశుభ్రమైన వాతావరణంలో పెంచుతుండటం వల్ల వారిలో విరేచనాలు, కామెర్ల వంటి సమస్యలు బాగా తగ్గిపోయాయని చెప్పొచ్చు. కానీ మరోవైపు అలర్జీల వంటివి పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరమే అయినా.. బయటి నుంచి ఎలాంటి సూక్ష్మక్రిముల తాకిడీ లేకపోవటం వల్ల మన ఒంట్లో సహజంగా ఉండే సూక్ష్మక్రిములు, వాటి స్వభావం కూడా విపరీతమైన మార్పులకు లోనవుతోందని, ఫలితంగానే మధుమేహం, వూబకాయం, ఆల్జిమర్స్‌ వంటి సమస్యలూ పెరుగుతున్నాయన్న సిద్ధాంతాలూ వినిపిస్తున్నాయి. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండటం అవసరమేగానీ.. ఆ శుభ్రత అన్నది ఎంత వరకూ అవసరమన్న ప్రశ్నలు కీలకంగా తయారయ్యాయి.

చిన్నతనంలోనే మేలు!
పిల్లలు పసివయసులోనే రకరకాల సూక్ష్మక్రిములు, వాటి వాతావరణానికి అలవాటుపడటం ముఖ్యమన్నది నేడు వైద్యపరిశోధనా రంగం క్రమేపీ గుర్తిస్తున్న వాస్తవం. అందుకే పిల్లలను సాధ్యమైనంత వరకూ ఆరుబయటకు, పార్కులకు, మైదానాలకు తీసుకువెళ్లి తరచూ కొంత సమయం అక్కడ గడిపేలా చూడటం అవసరం. చాలమంది పిల్లలు మట్టిలో ఆడితే మంచిది కాదని నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి ఇలా మైదానాలు, మట్టి వంటి వాటి నుంచి మనకు హానికారక క్రిములు సోకటమన్నది చాలా తక్కువ. చాలా వరకూ హానికారక బ్యాక్టీరియా మనకు ఆహారం నుంచి, అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్న పదార్ధాల నుంచే సోకుతోంది. దాదాపు 18 ఐరోపా దేశాల్లో చేసిన అధ్యయనాలను పరిశీలిస్తే పిల్లల్లో తలెత్తుతున్న జీర్ణసమస్యల్లో మూడోవంతు రెస్టారెంట్లలో, ఇళ్లలో సరైన శుభ్రతా పద్ధతులు పాటించకపోవడం వల్లనే వస్తున్నాయని తేలింది. ముఖ్యంగా కూరగాయలు, మాంసం వంటివాటిని పద్ధతి ప్రకారం శుభ్రం చెయ్యకపోవటం, దానివల్ల హానికారక బ్యాక్టీరియా విజృంభించటం సమస్యగా ఉంటోంది. కాబట్టి తరచూ చేతులు కడుక్కోవటం వంటి శుభ్రతా చర్యలను మనం విస్మరించటానికి లేదు. ఇంట్లో కొన్నికొన్ని ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. దీన్నే ఇప్పుడు టార్గెటెడ్‌ హైజీన్‌’ అంటున్నారు. 1950ల నుంచీ ప్రాచుర్యంలో ఉన్న విధానమే అయినా.. ముఖ్యంగా ఆసుపత్రులు, ఆపరేషన్‌ థియేటర్ల వంటివాటిలోనే దీన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇంటి విషయంలో కూడా ఈ విధానం అనుసరించటం మేలని సూచిస్తున్నారు. తరచూ ఇంట్లోకి తాజా గాలి, వెలుతురు వచ్చేలా చూడటం, సాధ్యమైనంత తరచుగా ఆరుబయట గడపటం మంచిది. ఎందుకంటే మట్టి మంచిది! ఎంతలేదన్నా రోజుమొత్తమ్మీద 50-60 మిల్లీగ్రాముల మట్టి, మట్టిసంబంధ పదార్ధాలు మన లోపలికి వెళ్లిపోతుంటాయి. తోటపని వంటివి చేసేవారిలో ఇది రెట్టింపు కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా మంచే చేస్తుందని, మన శరీరంలోని బ్యాక్టీరియా వాతావరణం దీనివల్ల బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శుభ్రం చేసేందుకు వాడే సబ్బులు, క్లీనింగ్‌ పదార్ధాలను చాలా పరిమితంగానే వాడాలన్నది వీరి విస్పష్ట సూచన!

ముఖ్యంగా శుభ్రత అని ఇల్లంతా కడగటం, ప్రతిదీ తుడవటం వంటివాటితో అతి చేసేకంటే ఇంట్లో కొన్నికొన్ని ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీన్నే ఇప్పుడు టార్గెటెడ్‌ హైజీన్‌’ అంటున్నారు. ఇంట్లో దృష్టిసారించాల్సినవి....
* పొయ్యి, పొయ్యి గట్టు

* కూరగాయలు తరిగే ప్రదేశం, కూరలు తరిగే చెక్క వంటివి.

* ఇంట్లోని తలుపు గడియలు, కరెంట్‌ స్విచ్‌లు, టాయ్‌లెట్‌ గడియలు, నల్లాల వంటి అంతా ముట్టుకునే వాటిని తరచూ శుభ్రం చెయ్యటం అవసరం.

* కూరలు, ముఖ్యంగా మాంసం తగిలే, తరిగే ప్రదేశాలన్నింటినీ శుభ్రంగానే ఉంచుకోవాలి.

* ఇక గోడలు, తలుపులు, పడకల వంటివంటారా.. మీకు అలర్జీలు, ఆయాసాల వంటి సమస్యలేం లేకపోతే... మరీ అంత అతి చాదస్తంగా మూడుమూడు రోజులకూ శుభ్రం చెయ్యక్కర్లేదన్నదే నేటి పరిశోధనల సారాంశం!

* దుమ్ము పేరుకుని ఇబ్బందిగా లేకపోతే వాటిని మూడునెలలకోసారి శుభ్రం చేసినా నష్టం లేదు.

తుడవటం కాదు.. కడగండి!

మనం అనుకుంటాం... గిన్నెల్నీ, కప్పుల్నీ సబ్బుతోనో, సర్ఫుతోనో శుభ్రం చేసేస్తే వాటి మీద ఉండే సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయని! కానీ వాస్తవానికి సబ్బులుగానీ, సర్ఫులుగానీ సూక్ష్మక్రిములనేం చంపవు. అవి కేవలం- సూక్ష్మక్రిములు గిన్నెలకు అతుక్కుని ఉండకుండా వదలగొట్టే పని మాత్రమే చేస్తాయి. కాబట్టి మనం డిటర్జెంట్‌ పెట్టి గుడ్డతో తుడిచేస్తే పోతుందనుకుంటే తప్పే. ఎంత తుడిచినా అవక్కడే ఉంటాయి. శుభ్రంగా నీళ్లతో, వీలైతే నీళ్ల ధార కింద కడగటం ఒక్కటే సరైన మార్గం!

కడగటం.. ఎప్పుడెలా?
చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవటం తప్పనిసరి. దానివల్ల తరచూ జలుబు, వాంతులు, విరేచనాలు, శ్వాససమస్యల వంటివి వేధించకుండా ఉంటాయి. కాబట్టి వంట చెయ్యటానికి ముందు, వంట తర్వాత, భోజనం చెయ్యటానికి ముందు, చేసిన తర్వాత, టాయ్‌లెట్‌కు వెళ్లిన తర్వాత, కుక్కల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత, చెత్తాచెదారం ముట్టుకున్న తర్వాత.. తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాల్సిందే.

క్షణాల్లో తీసేసినా సరే!
కూరముక్కలు, ఆహార పదార్ధాలు కిందపడ్డాయంటే నేల మీదుండే కలుషిత బ్యాక్టీరియా క్షణాల్లో.. ఇంకా చెప్పాలంటే సెకను కంటే తక్కువ సమయంలోనే దాన్ని పట్టేసుకుంటుంది. కాబట్టి కింద నేల ఎంతో శుభ్రంగా ఉందని అనుకుంటే తప్పించి కిందపడిన వాటిని తీసుకోవద్దు. ముఖ్యంగా మన ఇంట్లో కుక్కల వంటివి తిరుగుతుంటే.. నేల మీద పడిన పదార్థాలను అస్సలు తీసి మళ్లీ వాడొద్దు. అలాగే మాంసం వంటి వాటిని.. ఎక్కడ పెట్టినా.. కొద్ది క్షణాల పాటే ఉంచినా సరే, ఆ ప్రాంతాన్ని కడగాల్సిందే. ఇలా పెట్టి అలా తీసేశాం కదా.. కడగక్కర్లేదని అనుకోవద్దు.

వేటిని కడగాలి?
కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా కడగాల్సిందే. చికెన్‌ కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోళ్ల మీద క్యాంపైలోబ్యాక్టర్‌ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి చికెన్‌ను కడిగినప్పుడు ఆ బ్యాక్టీరియా కడిగిన ప్రాంతమంతా పడి.. మన చేతులకు అంటుకుని.. అక్కడి నుంచి నోటిలోకి, పొట్టలోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చికెన్‌ని తగిన వేడి మీద బాగా ఉడికించటం ముఖ్యం.

దులుపుడు.. ఎప్పుడెప్పుడు?
తరచూ ఇల్లు, కిటికీలు, పరుపులు, దిండ్లు, కర్టెన్ల వంటివన్నీ దులపటం, వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చెయ్యటం అవసరమా? అంటే ఇంట్లో ఆస్థమా, అలర్జీల వంటివి ఉన్న వాళ్లకు ఇది తప్పనిసరి. ఇవేమీ లేనివాళ్లు మరీ మూడుమూడు రోజులకూ ఇల్లు దులిపే పనులేం పెట్టుకోనవసరం లేదు. దానివల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేక ప్రయోజనాలేం ఉండవని అధ్యయనాల్లో తేలింది.

ఒత్తిడికి ఇదీ కారణమే!

ఆశ్చర్యంగా అనిపించొచ్చుగానీ ఇల్లు శుభ్రంగా లేకపోవటం కూడా కొందరిలో ఒత్తిడికి కారణమవుతోంది! ముఖ్యంగా శుభ్రత ధ్యాస ఎక్కువగా ఉండే వారికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నా మానసిక ఒత్తిడి పెరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఇల్లు శుభ్రంగా, కాస్త పద్ధతిగా ఉంచుకోవటమన్నది మానసిక ప్రశాంతతకు దోహదం చేసే అంశమని మరువద్దు!

శుభ్రం చేసే వాటితోనే కాలుష్యం!

ఇంటిని, ఇంట్లోని వస్తువులను కడిగేందుకు, తుడిచేందుకు మనం వాడే రకరకాల క్లీనింగ్‌ రసాయనాల వల్ల ఇళ్లలో కొత్తరకం సమస్య మొదలవుతోంది. ఎక్కడో బయటి కాలుష్యం సంగతి అలా ఉంచండి.. ఇప్పుడు ప్రమాదకర కాలుష్యం ఇంట్లోనే చాలా ఎక్కువ పోగవుతోంది. దీనికి మనం వాడే రకరకాల క్లీనింగ్‌ రసాయనాలే మూలం’’ అంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ముఖ్యంగా గదులను తాజాగా ఉంచటం కోసమంటూ మనం వాడే రూమ్‌ ఫ్రెషనర్లే కాదు.. మనం వాడే షాంపూలు, సబ్బులు, వాషింగ్‌ పౌడర్లు, సువాసనల కోసం వెలిగించే కొవ్వొత్తులు, నేల తుడిచే క్లీనర్ల వంటివన్నీ ఈ రసాయన కాలుష్యాన్ని తెచ్చిపెట్టేవే. ఎందుకంటే ఈ ఉత్పత్తుల్లో అసలు ఏమేం ముడిపదార్ధాలను వాడుతున్నారో వీటి మీద పేర్కొనాల్సిన చట్టపరమైన నిబంధనలేవీ లేవు. విడివిడిగా చూసినప్పుడు వీటిలోని రసాయనాలు సురక్షిత స్థాయుల్లోనే ఉండొచ్చుగానీ.. మనం ఇళ్లలో వీటన్నింటినీ కలిపి ఎడాపెడా వాడేసినప్పుడు అన్నీ కలిసి ఏ స్థాయికి చేరుతున్నాయో తెలీదు. అందుకని శుభ్రత, తాజాదనాల కోసం.. సాధ్యమైనంత వరకూ వెనిగర్‌, తినే సోడా (సోడాబైకార్బొనేట్‌), నిమ్మకాయల వంటి ఏమాత్రం హానిలేని, మనం తిన్నా కూడా ఎలాంటి నష్టం చెయ్యని పదార్ధాలనే వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తరచూ ధారాళంగా గాలీవెలుతురూ ఇంట్లోకి వచ్చేలా కిటికీలు తీసి ఉంచాలి. నాసా పరిశోధకులు అంతరిక్ష నౌకల్లోనూ, అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లోనూ చేసిన ప్రయోగాల్లో గదుల్లో పెట్టిన మొక్కలు- అక్కడి వాతావరణంలోని బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి రసాయనాలను గ్రహించేస్తున్నాయని గుర్తించారు. కాకపోతే మనం ఒకవైపు రోజంతా నానా రకాల రసాయనాలను వాడిపారేస్తూ.. మరోవైపు ఒకటో రెండో మొక్కలు పెడితే అవి ఏం చెయ్యలేవు. పైగా ఈ రసాయనాలు వాటినీ దెబ్బతీస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ పరిశుభ్రత పేరిట రసాయనాల వాడకం తగ్గించటం, వీలుంటే కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవటం మంచిది!

కలుషిత రసాయనాలు మనం ఇంటిని తాజాగా, శుభ్రంగా ఉంచాలని వాడే ఉత్పత్తుల నుంచే వస్తున్నాయి! తాజా సువాసనల కోసం ఈ ఉత్పత్తుల్లో వాడే లెమోనీన్‌ వంటి రసాయనాలు మన వాతావరణంలో ఉండే ఓజోన్‌తో కలిసి ఫార్మాల్డిహైడ్‌’ వంటి క్యాన్సర్‌ కారక రసాయనాలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బయటి నుంచి గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే అవకాశం లేని గదుల్లో ఈ రసాయనాలు, ఫ్రెష్‌నర్ల వంటి వాటిని ఎక్కువ వాడటం మరింత ప్రమాదకరం. వీటిని ఎయిర్‌ ప్యూరిఫయర్లు’ కూడా వదిలించలేవు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com